Saturday, 25 January 2014

ఈ వారం కవిత : ఊరికే...అలా..!

కొన్ని రోజులు
అలా గడిచిపోతాయి,
ఊరికే.
గుర్తులన్నీ దారినిండా అడ్డొస్తున్నా
వాటి మీదుగానే నడిచొచ్చేసేంత మౌనం
అదే ధైర్యమని ముందే తెలిస్తే
ఎన్నో క్షణాలు బాధపడకపోను!
ఎవరెవరో గుంపులుగుంపులుగా నవ్వుతున్న శబ్దాలు
వాటి వెనక ఎన్ని ఖాళీలో అన్ని లోతులు
విడి విడిగా అడిగితే
ఒక్కో కథ చెబుతుంది ప్రతి నవ్వు.
పరిగెత్తినప్పుడు
ప్రతి అంగలో ఎన్ని కాలాలు మారాయో,
ఆగినప్పుడే తెలిసేది ... తేలకపోతేనే యాతన
ఒక నీరెండలాంటి భావన
కిటికీ అంచులకి వేలాడే వెన్నెల చుక్క
తడి కవితలు రాయిస్తుంది అర్ధరాత్రి
ఒక తప్పిపోయిన కల కోసం
వెలితిని నింపే వేకువ కోసం
గదిలైటుతో పోటీపడుతున్న పగటి దీపం
ఎప్పుడూ పట్టించుకోలేదు ఎవరి కాంతి ఎంతని
నిజం చీకటి సొత్తని తెలిసాక
వెలుతురు వెగటు పుడుతుంది ఏదో నిమిషాన.
నిజమే,
కొన్ని రోజులు
ఊరికే అలా గడిచిపోతాయి, ఊరికే!
మొండిగా ... ఒట్ఠిగా
నా నుండి నిన్ను వేరు చేసేలా!
- మోహనతులసి

1 Comment:

veerendra said...

excellent .

www.dreamervalley.blogspot.com

Post a Comment